తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాల విషయంలో తగ్గేదే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మితమైన వివిధ ప్రాజెక్టులపై నెలకొన్న వివాదాల్లో గట్టిగా పోరాడాలని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని సీఎం నిర్ణయించాయి. నీటి పారుదలపై నిర్వహించిన కీలక సమీక్షలో ఈ మేరకు ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నిర్దేశించిన నేపథ్యంలో, త్వరలో ఏర్పాటయ్యే బోర్డుల సమావేశాల్లో తెలంగాణ అనుసరించాల్సిన వ్యూహం పై ప్రగతి భవన్‌లో శుక్రవారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అత్యున్నత సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణకు హక్కుగా కేటాయించబడిన న్యాయమైన నీటివాటాలకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులను క్షుణ్ణంగా మరోసారి ఈ సమావేశంలో సమీక్షించారు.