Skip to main content

నిధులు కేంద్రానివి...పేరు రాష్ట్రానికి

 


గ్రామ పంచాయతీల అబివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని, పనులకు మాత్రం రాష్ట్రప్రభుత్వం గులాబీ రంగులు వేసుకుంటుందని ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. హుజూరాబాద్‌లో శుక్రవారం మహేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన భాజపా పట్టణశాఖ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ పల్లెల్లో నిర్మితమవుతున్న వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, ఉపాధిహామీ పథకం, రేషన్‌ బియ్యం వంటి పథకాలకు కేంద్రం నిధులు కేటాయిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తమ ఖజానా నుంచే నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించుకోవటం విడ్డూరమన్నారు. . 2004 నుంచి 2018 వరకు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఆస్తుల అఫిడవిట్లను చూద్దామని, ఇందులో ఎవరి అక్రమ ఆస్తులుంటే వారి ఆస్తులను గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల కుటుంబాలకు అంకితం చేద్దామా అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌ అక్రమ ఆస్తులు సంపాదించి ఉంటే అందులో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇచ్చిన వాటా ఎంతుందో చెప్పాలని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, నాయకులు పైళ్ల వెంకట్‌రెడ్డి, గంగిశెట్టి ఉమామహేశ్వర్‌, గూడూరు ప్రభాకర్‌రెడ్డి, మాడ్గుల ప్రవీణ్‌, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, మాసాడి ముత్యంరావు, పంజాల సతీష్‌, పాల్గొన్నారు.