Skip to main content

చైనా ఆగడాలను అడ్డుకోవడమే లక్ష్యం.. చైనా-భారత్‌ సరిహద్దుల వద్ద 50 వేల మంది భారత సైనికులు

 

చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తొలగడం లేదు. దీంతో భారత్‌ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అవసరమైతే దాడి చేసేలా ప్లాన్‌ చేస్తోంది. దీని కోం భారత్‌ అదనంగా 50 వేల మంది సైనికులను చైనా సరిహద్దుల వద్ద మోహరించినట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. గతేడాది లెక్కలతో పోలిస్తే ఇప్పుడున్న దళాల సంఖ్య 40 శాతం అధికం. అటు సముద్ర జలాల్లోనూ చైనాపై నిఘా పెంచేందుకు భారత నావికాదళం సైతం చర్యలు చేపట్టింది. చైనాను ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్‌ చర్యలు చేపడుతోంది. ఈమేరకు సరిహద్దుల వద్ద డ్రాగన్‌ చర్యల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా అదనంగా 50 వేల మంది సైనికుల్ని, యుద్ధ విమానాల్ని చైనా సరిహద్దుల వద్ద భారత్‌ మోహరించినట్లు ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. ప్రస్తుతం చైనా సరిహద్దుల్లో భారత సైనికులు 2 లక్షల మంది పహారా కాస్తున్నారట. ఇది 2020 నాటి లెక్కలతో పోలిస్తే 40 శాతం కన్నా అధికం. అయితే ఇది వరకు చైనా ఆగడాలను అడ్డుకోవడమే లక్ష్యంగా సైనిక మోహరింపులు ఉండేవి. అయితే ఆ విధానానికి స్వస్తి పలుకుతూ భారత్‌ ముందుకుసాగుతోంది. డ్రాగన్‌ సైన్యాన్ని అడ్డుకోవడమే కాకుండా.. అవసరమైతే దాడి చేసేలా భారత్‌ వ్యవహరిస్తోందని బ్లూమ్‌బర్గ్‌ ఓ నివేదికలో పేర్కొంది.


సరిహద్దుల్లోకి మరిన్ని బలగాలను మోహరించడం ద్వారా.. హిమాలయాల్లో చైనాను ఢీకొట్టేలా సైనికులు అలవాటు పడేందుకు అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రవేశపెట్టిన రఫేల్‌ సహా, ఫైటర్‌ జెట్లను సైతం చైనా సరిహద్దు వెంబడి మూడు విభిన్న ప్రాంతాలకు తరలించారు. సముద్ర మార్గం గుండా చైనా నుంచి బయటకొచ్చే వనరులు, వాణిజ్య పరమైన అంశాలపై నిఘా ఉంచేందుకు భారత నావికాదళం సైతం యుద్ధ నౌకల్ని మోహరిస్తోంది. గల్వాన్‌ లోయలో గతేడాది జరిగిన ఘర్షణ అనంతరం డ్రాగన్‌ను ఎదుర్కొనేందుకు ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది